Wednesday, December 12, 2012

సి.పి.టి. లో అర్హత సాధించటం ఎలా?

డిసెంబర్ 16 వ తేదీన జరగబోయే సి.పి.టి.లో అర్హత సాధించటం ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే. క్రింద చెప్పబడిన సలహాలు, సూచనలు పాటించండి. సి.పి.టి. లో అర్హత సాధించండి.

మొదటగా సి.పి.టి.(కామన్ ప్రొఫీషి యన్సీ టెస్ట్) లో  నెగటివ్ మార్కులు ఉన్నాయి కనుక మీకు తెలియని ప్రశ్నలకి ఊహించి సమాధానాలు రాయవద్దు. బాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయండి. మొదటి పేపరు ఫండమెంటల్స్ ఆఫ్ ఎకౌంటింగ్ మరియు మర్కెంటైల్ లా. దీనిలో 60 మార్కులకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎకౌంటింగ్ కనుక అది బాగా తెలిసి ఉంటే మొత్తం మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే మర్కెంటైల్ లా లో కూడా మరీ ఎక్కువ సిలబస్ లేదు కనుక కొంచెం జాగ్రత్తగా చదివితే మార్కులు తెచ్చుకోవటం సులభమే. ఇక రెండవ పేపర్లో ఎకనామిక్స్ సగం సిలబస్ చదివినా కూడా సగం మార్కులు తెచ్చుకోవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో లెక్కలు బాగా వస్తే మార్కులు బాగానే వస్తాయి. అయితే ఎం.పి.సి. వాళ్ళకు ఈ లెక్కలు కొత్త కాదు కానీ, మిగతా వాళ్ళకు ముఖ్యంగా సి.ఇ .సి. వాళ్ళకు ఇవన్నీ ఎప్పుడో హైస్కూల్లో చదివినవి కనుక గుర్తుంచుకోవటం కొంచెం కష్టమయిన విషయమే. కనుక చేయగలిగినవి మాత్రమే చేయాలి. లేకపోతే వదిలేసినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ తప్పులు రాస్తేనే సమస్య.

సి.ఇ .సి. వాళ్ళు ఫండమెంటల్స్ ఆఫ్ ఎకౌంటింగ్ మరియు ఎకనామిక్స్ బాగా చదివి ఉంటే సి.పి.టి. పరీక్షలో ఉత్తీర్ణులవ్వటం చాలా సులభం. అలాగే ఎం.పి.సి. వాళ్ళు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బాగానే చేయగలరు కనుక దానితోపాటు  మిగిలిన మూడింటిలో అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకౌంటింగ్, మర్కెంటైల్ లా, ఎకనామిక్స్ లలో ఏది బాగా చదవగలరో దాన్ని బాగా చదివితే పరీక్షలో ఉత్తీర్ణులవవచ్చు. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అన్ని సబ్జెక్టులు బాగా చదవాలి కానీ పరీక్షలో అర్హత సాధించాలంటే ఏవైనా రెండు సబ్జెక్టులు బాగా చదివి, మూడోది కొంచెం నేర్చుకున్నా చాలు. ఒక సబ్జెక్ట్ వదిలి వేసినా కూడా ఫర్వాలేదు. చాలామంది విద్యార్ధులు చేసే తప్పు ఏమిటంటే ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానాన్ని గుర్తించటం. మీరు వంద ప్రశ్నలు సరిగ్గా రాసి, మిగిలిన వంద (తెలియకపోతే) వదిలేసినా కూడా ఉత్తీర్ణులవుతారు. అదే వంద ప్రశ్నలు సరిగ్గా రాసి, మిగిలిన వంద ప్రశ్నలకు తెలియకపోయినా కూడా ఏదో ఒకటి రాస్తే (నెగటివ్ మార్కులు ఉండటం వలన) అనుత్తీర్ణులవుతారు. కనుక ఖచ్చితంగా సమాధానం తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించకండి. ఇదే మార్కులు సాధించటానికి గోల్డెన్ రూల్. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని, పేపరు ఇవ్వబోయే ముందు గుర్తించిన సమాధానాలని ఒకసారి సరిచూసుకోండి.

No comments:

Post a Comment